జయలలిత జీవిత నేపథ్యంలో రూపొందుతున్న పలు చిత్రాలు సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాలలో ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న తలైవీ చిత్రం ఎక్కువగా వార్తలలో నిలుస్తూ వస్తుంది. జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటిస్తుండగా, ఇటీవల ఆమె లుక్ విడుదలైంది. జయ పాత్రలో కంగనా లుక్ అదిరిందని ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే తలైవీ సినిమాలో పలు పాత్రలకి సంబంధించిన లీకులు బయటకి వస్తున్నాయి. ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి నటిస్తున్నారని కొద్ది రోజుల క్రితం వార్తలు రాగా, తాజాగా శోభన్ బాబు పాత్రలో టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ హీరో చేస్తన్నాడంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. జయ జీవితంలో కీలక వ్యక్తి అయిన శోభన్ బాబు పాత్రని విజయ్ దేవరకొండ చేస్తున్నాడట. ఇప్పటికే సావిత్రి జీవిత నేపథ్యంలో తెరకెక్కిన మహానటి చిత్రంలో కీలక పాత్ర పోషించిన విజయ్.. ఇప్పుడు జయలలిత బయోపిక్‌లోను నటించేందుకు సిద్ధమయ్యాడని చెబుతున్నారు. విష్ణు ఇందూరి నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల కానుంది.